Jayaprabha


ప్రకృతి పర్యంతమూ - Poem by Jayaprabha

ఆకులన్నీ రాలాకా వచ్చే తొలి చిగురు
నీ ఉద్రేకం లాంటిది !
ముద్దు తర్వాత
చర్మం మీద కమిలిన ముద్ర లాగానే
మెత్తగా ఎర్రబడుతుంది !

నిన్ను గుర్తు చేస్తూ
సీమచింత చెట్టు మీద పంచవన్నె పక్షులు
వసంతాన్ని తెస్తాయి !
నాలో పాత జ్ఞాపకాలు
నారింజవాసనలతో వీస్తాయి !!

నీరెండ పడిన తడి ఆకుల్లో
నీ నవ్వు తళతళలను చూసి ఎగిసి
కాసిన్ని కిరణాలను వడిసి పడతాను !
ఉన్మత్తంగా చల్లగాలి వెంట పరుగు పెడతాను
స్వర్ణసముద్రంలోకి
సూర్యుడినావ మీద బయలుదేరి
ద్వీప ద్వీపాల నించి
స్వప్న సుగంధాలెన్నో సేకరిస్తాను !

ఏదీ ?
ఎంత వెతికినా ఎన్ని ఉదయాలు గడిచినా
నువ్వెక్కడా కనిపించవేం ?
అనేక మలుపులతో
జానపదగాధకు మల్లే
నా ముందుకొస్తావు కాబోలు !

సంచారజీవనం లాంటి నీ సాహచర్యంలో
నాకు స్థిమితమూ ఉండదు
స్థిరత్వమూ ఉండదు

అయినా సరే !
మృదువుగా ఒకసారి
మహోధృతంగా ఒకసారి
నేను జీవనదిగా కొనసాగుతాను !
ప్రకృతి పర్యంతమూ...
నీ జాడ కోసం !
127 Total read