రైలు దూసుకుపోతున్నప్పుడు
పాడుబడ్డ కోటలా వెనకబడిపోవటమే బాధ !
చీకటికి లొంగిన సాయంత్రంలా మసకబడి
కరిగిపోవటమే బాధ !
జాలువారిన అశృకణం బాధ ! చితాభస్మం బాధ !
వ్యక్తావ్యక్త మనో ప్రపంచపు మాయాజాలం బాధ !
ఎలా వ్యక్తీకరించటం బాధని ?
బాధ పిదప ఏమీలేనితనాన్ని !!
వ్యధకి భాష చాలదు
పండుటాకు లాంటిదది
దిగుడుబావి లాంటిదది
వడిలి ... ఎండిపోయిన మొక్కలాంటిదది
మునివాకిట చెరిగిన ముగ్గులాంటిదది
బాధగా ఉంటున్నప్పుడు
బాధ పోతుందని నమ్మడం కష్టమే !
నడి ఎండలో రాని తొలకరి రాకనూహించడం కష్టమే !!
చింతనలో ఒంటరినై చిట్లిపోయి
ఎలా వ్యక్తీకరించటం బాధని ?
బాధ పిదప ఏమీలేనితనాన్ని !!
వ్యధకి భాష చాలదు
క్షతగాత్ర శరీరం లాంటిదది
ఒక్కోసారి కురవని మేఘం లాంటిదది
మరి బాగుపడని పాత గడియారం లాంటిదది
మరణించిన నాన్న జ్ఞాపకం లాంటిదది